![]() |
![]() |
(అక్టోబర్ 20 హాస్య నటుడు రాజబాబు జయంతి సందర్భంగా..)
సినిమా రంగంలో పేరు, డబ్బు సంపాదించిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. హీరో, హీరోయిన్, క్యారెక్టర్ అర్టిస్ట్, కమెడియన్... ఎవరైనా సినిమాల ద్వారా తాము ఇంత సంపాదించాం అని ధైర్యంగా చెప్పగలరా? కానీ, నవ్వుల రారాజు రాజబాబు చెప్పారు. తాను సినిమాల్లో నటించడం ద్వారా కోట్లు సంపాదించానని బహిరంగంగా ప్రకటించారు. రాజబాబు ఆ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తడానికి, నటుడిగా తెరపై కనిపించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే కమెడియన్‌గా రాజబాబుకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన డైలాగులు చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు నవ్వుల్తో నిండిపోయేవి. పాతతరం హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు రాజబాబు. తను సినీరంగానికి రావాలి, నటుడుగా మంచి పేరు తెచ్చుకోవాలి అనే కోరిక కలగడానికి ముఖ్య కారణం హాస్యనటుడు బాలకృష్ణ. పాతాళభైరవి చిత్రంలో ఆయన పోషించిన అంజిగాడు పాత్ర రాజబాబుని అంతగా ప్రభావితం చేసింది. ఆ సినిమాను రాజబాబు 90 సార్లు చూశారంటే ఆశ్చర్యం కలగక మానదు. రెండు దశాబ్దాలపాటు విరామం లేకుండా ప్రేక్షకుల్ని నవ్విస్తూ 514 సినిమాల్లో నటించారు రాజబాబు. శతాబ్దపు హాస్యనటుడు అవార్డు పొందిన రాజబాబు.. సినీ రంగంలోకి ఎలా వచ్చారు, ఆయన జీవిత విశేషాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1935 అక్టోబర్ 20న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించారు. నిడదవోలులో చదువుకునే రోజుల్లోనే బుర్రకథ నేర్చుకున్నారు రాజబాబు. ఎన్నో నాటక సమాజాల్లో నాటకాలు వేశారు. అది ఆయన తండ్రికి నచ్చేది కాదు. అయినా తండ్రికి తెలియకుండా నాటకాలు వేయడం, బుర్రకథ నేర్చుకోవడం చేసేవారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నాటకరంగంలో పితామహుడిగా పేరు తెచ్చుకున్న గరికపాటి రాజారావు, స్నేహితులు.. రాజబాబును సినిమాల్లో వెళ్ళాల్సిందిగా ప్రోత్సహించారు. తనకి కూడా సినిమాల్లో నటించాలనే కోరిక ఉండడంతో మద్రాస్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇంట్లో వారితో చెబితే ఒప్పుకోరని ఎవరికీ చెప్పకుండా 1960 ఫిబ్రవరి 7న మద్రాస్ రైలెక్కేశారు రాజబాబు.
అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివరికి పూట గడవడం కష్టంగా ఉన్న సమయంలో నటుడు, దర్శకుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ట్యూషన్ చెప్పారు. ఆ సమయంలో పిల్లల్ని, ఆ కుటుంబ సభ్యుల్ని తన మాటలతో బాగా నవ్వించేవారు. అది చూసిన నారాయణరావు తన దర్శకత్వంలో రూపొందిన సమాజం చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల్లో నటించినందుకు రూ.350 పారితోషికం అందుకున్నారు. 1965లో వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించిన అంతస్తులు చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశారు. పారితోషికం ఎంత కావాలి అని రాజేంద్రప్రసాద్ అడిగితే.. మీకు తెలుసు కదా.. ఇవ్వండి అన్నారు రాజబాబు. అయితే అతని పారితోషికాన్ని ఒక్కసారిగా రూ.1300కి పెంచారు నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్. అంతస్తులు చిత్రంతో రాజబాబు కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. అవకాశాలు అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాజబాబుకి రాలేదు. 1960లో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 1979 వరకు ఉజ్వలంగా సాగింది. ముఖ్యంగా 1960, 1970 మధ్యలో రాజబాబు లేని సినిమా దాదాపు లేదంటే అతిశయోక్తి కాదు.
రాజబాబు సరసన ఎక్కువ సినిమాలు చేసిన నటి రమాప్రభ. వీరిద్దరూ కలిసి 16 సంవత్సరాలపాటు 100 సినిమాలు చేశారు. హీరో ఎవరైనా రాజబాబు, రమాప్రభ సినిమాలో ఉండాల్సిందే. హీరో డేట్స్ తీసుకున్న వెంటనే వీరిద్దరి డేట్స్ కన్‌ఫర్మ్ చేసుకునేవారు నిర్మాతలు. పోస్టర్ మీద వీరిద్దరి ఫోటోలు ఉన్నాయంటే సినిమా సూపర్‌హిట్ అనే సెంటిమెంట్ హీరోలకూ వచ్చేసింది. ఆ తర్వాత మీనాకుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి వంటి నటీమణులు కూడా రాజబాబుతో ఎక్కువ సినిమాలు చేశారు. అప్పటికే రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం వంటి హాస్యనటులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎవరినీ అనుకరించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని హాస్యాన్ని పండించేవారు రాజబాబు. ఉత్తమనటుడిగా వరసగా 7 సార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్న తొలి హాస్యనటుడు రాజబాబు. మొత్తం 9 ఫిలింఫేర్ అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాగే మూడు నంది అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. అంతస్తులు చిత్రంతో బ్రేక్ వచ్చిన తర్వాత 1965 డిసెంబర్ 5న మహాకవి శ్రీశ్రీ మరదలు లక్ష్మీఅమ్ములుని వివాహం చేసుకున్నారు రాజబాబు. వీరికి నాగేంద్రబాబు, మహేష్‌బాబు సంతానం. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్ కూడా హాస్యనటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
రాజబాబు వ్యక్తిగత జీవితం ఎంతో విభిన్నమైనది. ఆయనలో తాత్విక లక్షణాలు ఎక్కువ. జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనే ఆలోచనలు ఎక్కువ చేసేవారు. తను జీవితంలో సంపాదించిన దానిలో ఎక్కువ శాతం దాన ధర్మాలకే వినియోగించారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున సీనియర్ నటీనటుల్ని ఘనంగా సన్మానించేవారు. వారిలో మొదటగా తనకు స్ఫూర్తిగా నిలిచిన బాలకృష్ణను సన్మానించారు. అలా సన్మానం అందుకున్నవారిలో రేలంగి, సూర్యకాంతం, సావిత్రి, డా.శివరామకృష్ణయ్య ఉన్నారు. అంతస్తులు చిత్రానికి ముందు ఒక సినిమా షూటింగ్ షాట్ పూర్తి చేసి బయటికి వచ్చినపుడు ఒక లైట్‌బోయ్ రాజబాబు నటనను ప్రశంసిస్తూ మీరు తప్పకుండా పెద్ద స్థాయికి వెళతారు. అప్పుడు నాకు బట్టలు పెట్టాలి అని అడిగాడు.
నటుడుగా ఎంతో బిజీ అయిపోయిన తర్వాత ఆ లైట్‌బోయ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అయితే అతను ఎలా ఉంటాడో గుర్తులేదు. అందుకే తన ప్రతి పుట్టినరోజున మద్రాస్‌లోని అన్ని స్టూడియోల్లో పనిచేసే లైట్‌బోయ్స్‌కి బట్టలు పెట్టి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేవారు. పబ్లిక్ ట్రస్ట్ పేరుతో ఓ సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కోరుకొండలో జూనియర్ కళాశాలను కట్టించారు. రాజబాబు పేరుతోనే ఆ కాలేజీ ఉంది. రాజమండ్రిలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం అదే ఊరిలో బంగీ కాలనీ కట్టించారు. తన భార్య పేరు మీద రాజమండ్రిలో ఒక ఆడిటోరియం నిర్మించారు. రాజబాబు సేవా నిరతికి ఉదాహరణగా ఒక సంఘటన గురించి చెప్పాలి. ‘రాణి ఔర్ లాల్‌పరి’ అనే హిందీ సినిమా కోసం ఒక పాటలో నటించారు. రెమ్యునరేషన్ ఎంత ఇవ్వమంటారు అని నిర్మాత అడిగారు. చేసింది ఒక పాటే కాబట్టి ఐదు వేలు ఇస్తే చాలు అనుకున్నారు రాజబాబు. కానీ, ఆ నిర్మాత 40వేలు ఇచ్చారు. అయితే తను మాత్రం ఐదువేలే తీసుకొని మిగిలిన డబ్బును ఆ సినిమా షూటింగ్‌లో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ పంచి పెట్టేశారు. పాత తరం నుంచి ఇప్పటివరకు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన హాస్యనటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
సినిమాల ద్వారా కొన్ని కోట్లు గడిరచానని రాజబాబు చెప్పుకునేవారు. అయితే సినిమాలు నిర్మించడం వల్ల, దానధర్మాలు చెయ్యడం వల్ల ఆస్తంతా కరిగిపోయిందని, చివరి రోజులు ఎంతో దీనావస్థలో గడిపారని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని ఆయన సోదరుడు చిట్టిబాబు చెబుతున్నారు. 1983లో రాజబాబు చనిపోయే నాటికి హైదరాబాద్‌లో, మద్రాస్‌లో ఎన్నో ఆస్తులు ఉన్నాయని, ఆరోజుల్లో వాటి విలువ రూ.25 కోట్లని ఆయన తెలియజేస్తున్నారు. అలాగే మద్యానికి బానిసయ్యారని, వైవాహిక జీవితం సంతృప్తికరంగా లేదని, రాజబాబుని భార్య వదిలేసి వెళ్లిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. మద్యానికి బానిసైన మాట వాస్తవమే కానీ, దాని వల్ల ఆస్తులు కరిగిపోలేదని చిట్టిబాబు వివరించారు. రాజబాబుకి ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేష్‌బాబు. వీరిద్దరూ అమెరికాలో సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరు వందల కోట్లకు అధిపతులు. అంతేకాదు, ప్రస్తుతం మనం కారులో వినియోగిస్తున్న జిపిఎస్ వ్యవస్థను కనిపెట్టింది వారి సంస్థే.
1980 వచ్చేసరికి రాజబాబుకి అవకాశాలు కూడా తగ్గాయి. ఆ సమయంలోనే ఆయనకి గొంతు క్యాన్సర్ వ్యాధి సోకింది. ఒకసారి ఆపరేషన్ కూడా జరిగింది. రాజబాబుకి ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. ఆయన వర్థంతి అయిన ఫిబ్రవరి 11న రోజంతా ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదేరోజు మరోసారి రాజబాబు గొంతుకి ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో 1983 ఫిబ్రవరి 14న రాజబాబు తుదిశ్వాస విడిచారు. తన హాస్యంతో రెండు దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన రాజబాబు భౌతికంగా మనమధ్య లేకపోయినా తను పోషించిన పాత్రల ద్వారా జీవించే ఉంటారు.
![]() |
![]() |